నిధులు ఉన్నాయి.. హద్దులు చూపండి
రోడ్డు పనులు నిలిచిపోవడంతో తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన వార్డు సభ్యులు
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్మంజూరైన నిధులు ఉన్నప్పటికీ భూమి సరిహద్దుల వివాదంతో రోడ్డు పనులు నిలిచిపోవడంతో మైతాఫూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.సమస్యను వెంటనే పరిష్కరించి పనులు పూర్తిచేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.మైతాఫూర్ గ్రామంలోని శ్రీ గిరిగుట్ట (గన్నేగుట్ట)పై సుమారు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన కనకదుర్గాదేవి ఆలయానికి మెయిన్ రోడ్డునుంచి సిమెంట్ రహదారి నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు దామోదరరావు తన నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో రహదారి పనులు ప్రారంభమైనప్పటికీ,మధ్యలో భూమి పట్టాదారులు అడ్డుపడటంతో పనులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.భూమి సరిహద్దుల విషయంలో స్పష్టత లేకపోవడంతో వివాదం నెలకొన్నదని,రెవెన్యూ శాఖ అధికారులు,సర్వే అధికారులు గ్రామానికి వచ్చి సరిహద్దులు నిర్ణయిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.లేనిపక్షంలో మంజూరైన నిధులు వినియోగం కాకుండా తిరిగి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.గిరిగుట్టపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి పరిసర గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భక్తుల రాకపోకలకు అనుకూలంగా వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలో భూమి సరిహద్దుల సమస్యను తక్షణమే పరిష్కరించి రహదారి పనులు పూర్తి చేయాలని వార్డు సభ్యులు బత్తిని శ్రీనివాస్, తొగిటి నవీన్,అనుమల్ల రమ,బూస గంగామల్లయ్య,భూపల్లి పరమేష్, స్థానిక నాయకులు సత్యనారాయణ కలిసి తహసీల్దార్‌ను కోరారు.












