ప్రతి నెల చివరి శనివారం దివ్యాంగులు వృద్ధులకు ప్రజావాణి కార్యక్రమం....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:17ఇకపై దివ్యాంగులు, వృద్ధులకు ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.ఈనెల 28 నుండి ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి పీర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాల పై జిల్లా అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు వెళ్లాలని ,ఈ వారంలో సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలకు చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పథకం కింద ఇంకా మొదలు పెట్టని పనులపై నివేదిక సమర్పించాలని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని, పదవ తరగతి పరీక్షలు సవ్యంగా జరిగేలా మండల ప్రత్యేక అధికారులు చూడాలన్నారు. రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాల పంపిణీ, ఇఫ్తార్ ఏర్పాటుకు సంబందిత శాసనసభ్యుల సమ్మతి తో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 22, 23 తర్వాత రబీ ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నందున మిల్లుల టాగింగ్ ,గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరోసారి పరిశీలించి ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు.ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ కొరత లేకున్నప్పటికీ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ,అయితే రెడ్కో తరఫున ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లు 21 రోజుల నుంచి 45 రోజుల్లోపు సరఫరా చేయడం జరుగుతున్నదని, బ్లాక్ మార్కెటింగ్ చేయడం, డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య పరంగా వినియోగించడం నేరమని, హాస్టల్లు, పాఠశాలల్లో ఎల్పిజి గ్యాస్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.జనవరి, ఫిబ్రవరి మాసాలలో మండల ప్రత్యేక అధికారులు హాస్టళ్ల తనిఖీ సందర్భంగా గుర్తించిన అంశాలన్నింటిని నివేదిక సమర్పించాలన్నారు.ప్రజాపాలన ప్రగతిప్రాణాలిక అమలులో భాగంగా ఈనెల 6 నుండి 15 వరకు పరిశుభ్రత ,ఫైళ్ల పరిష్కారం చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి జిల్లా అధికారులందరూ వివరాలను స్ప్రెడ్ సీట్లో నివేదిక సమర్పించాలన్నారు.ఏప్రిల్ 2 న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహించనున్న దృష్ట్యా ప్రతి అధికారి వారి శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి గ్రామపంచాయతీ వారిగా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను ఎంపీడీవోలకు నివేదికలను సమర్పించాలని,ఈ నివేదికలను గ్రామసభలలో చదివి వినిపించాలని ఆదేశించారు.మున్సిపల్ కమిషనర్లు బయో మైనింగుకు చర్యలు తీసుకోవాలని ,బయో మైనింగ్ కింద పనులు ప్రారంభించేందుకు ఇది వరకే ఏజెన్సీలను నిర్ణయించడం జరిగిందని, ఏజెన్సీలకు అవసరమైన స్థలం, నీరు, ఇతర సదుపాయాలను ఈ వారంలోగా కల్పించాలన్నారు.నగర అభివృద్ధికి గతంలో ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీ 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి పనుల వారిగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు.అన్ని శాఖల అధికారులు ఈ- వేస్ట్ కింద తీసివేసిన ఈ- వేస్ట్ వివరాలను, అలాగే ఫైల్ మేనేజ్మెంట్ కు సంబంధించి క్లోజ్ చేసిన పైళ్ల నివేదిక ఇవ్వాలన్నారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ, చండూరు ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.కాగా ఈ సోమవారం రెవెన్యూకు 60 ఫిర్యాదులు,జిల్లా అధికారులకు 45 ఫిర్యాదులు వచ్చాయి .











