*సమాధుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించండి*
*కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )*
కుత్బుల్లాపూర్ డివిజన్ 286 పరిధిలోని సమాధుల ప్రాంగణాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ బుధవారం నల్ల జై శంకర్ గౌడ్ జీడిమెట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ... కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సమాధుల ప్రాంగణాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై ఉన్నాయని తెలిపారు. అక్కడ సరైన పరిశుభ్రత లేకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా సమాధుల వద్ద ఉన్న వాష్‌రూమ్‌లు దెబ్బతిన్న పరిస్థితిలో ఉండి ప్రజలు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయని, తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరమని తెలిపారు.
గతంలో ఏర్పాటు చేసిన బోర్‌వెల్ ప్రస్తుతం పనిచేయకపోవడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రియమైన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, సమాధుల ప్రాంగణాలు గౌరవప్రదమైన ప్రదేశాలు కావడంతో అక్కడ కనీస పౌర సౌకర్యాలు తప్పనిసరిగా ఉండేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా సమాధుల వద్ద బోర్‌వెల్‌ను మరమ్మత్తు చేసి తాగునీటి సౌకర్యం కల్పించడం, వాష్‌రూమ్‌లను పునరుద్ధరించడం, సమాధుల ప్రాంగణంలో క్రమం తప్పకుండా పరిశుభ్రత నిర్వహించడం, మొక్కలు నాటడం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల కార్యక్రమం కింద ఈ పనులను వెంటనే ప్రారంభించి టెండర్లు పిలిచి త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పులి బాలరాం, ప్రముఖ న్యాయవాది కేశవ్ లు తదితరులు పాల్గొన్నారు.












