తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
ప్రజా గొంతుక పెద్దపెల్లి ప్రతినిధి: ఇరుకుల్ల వీరేశం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఈ బోర్డు ద్వారా ఉద్యమకారులకు గుర్తింపు, ఆర్థిక సహాయం, పింఛన్లు, ఆరోగ్య సదుపాయాలు, పిల్లలకు విద్యా సాయం వంటి పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన వారికి న్యాయం జరిగే రోజులు వచ్చాయని, ఉద్యమకారులందరూ సంబరాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపారు.












