సోలార్" ఆశ చూపి నిలువు దోపిడీ..
కొత్తగూడెం వాసులారా జాగ్రత్త!
ప్రజా గొంతుక న్యూస్ ఫిబ్రవరి 17/ కొత్తగూడెం: (చుంచుపల్లి) అమాయకత్వమే పెట్టుబడిగా, అవసరమే ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతోనో, తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులని ఆశ చూపి మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా చుంచుపల్లి మండలం త్రీ ఇంక్లైన్ గ్రామపంచాయతీ పరిధిలో ఒక కిరాణా షాపు యజమానురాలు ఈ ‘కిలేడీ’ మోసగాడి బారిన పడి వేల రూపాయలు పోగొట్టుకుంది.
జనవరి 27న కుమార్ అనే వ్యక్తి (తాను కొత్తగూడెం సూర్యోదయ స్కూల్ సమీపంలో ఉంటానని పరిచయం చేసుకున్నాడు) సదరు మహిళ నడుపుతున్న కిరాణా షాపు వద్దకు వచ్చాడు. తక్కువ ధరకే "సోలార్ రిఫ్రిజిరేటర్" ఇప్పిస్తానని, అది వ్యాపారానికి ఎంతో లాభదాయకమని మాయమాటలు చెప్పి నమ్మించాడు. అతని మాటలు నిజమని నమ్మిన ఆ మహిళ, అతను అడిగిన 9,000 రూపాయలను ఫోన్ పే (PhonePe) ద్వారా పంపించింది. డబ్బులు చేతికి అందగానే సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు.
బాధితురాలి ఆవేదన..
కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును ఇలా మోసగాడి పాలు చేయడంతో ఆ మహిళ లబోదిబోమంటోంది. "నాకు జరిగిన అన్యాయం మరే ఇతర మహిళకు, చిన్న వ్యాపారులకు జరగకూడదు" అని ఆమె కన్నీటి పర్యంతమవుతూ హెచ్చరిస్తోంది.













