కొత్తగూడెం కార్పొరేషన్‌పై 'ఎర్రజెండా' రెపరెపలు
ప్రథమ మేయర్‌గా మూడ్ గణేష్!
ప్రజా గొంతుక న్యూస్ ఫిబ్రవరి 16/ కొత్తగూడెం,:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కార్పొరేషన్‌లోని 60 స్థానాలకు గానూ ఒంటరిగా పోరాడి, అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, వ్యూహాత్మక రాజకీయంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుని కమ్యూనిస్టు పార్టీ తన సత్తా చాటింది.
ఒంటరి పోరుతో సంచలనం
ఈ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులు 22 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. మరో స్థానంలో పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి గెలవడంతో సిపిఐ బలం 23కు చేరింది. అటు కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న రాజకీయ ఒప్పందంతో మేయర్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా పాలక పక్షంగా ఎర్రజెండా పాగా వేసింది.
సామాన్య కార్యకర్త నుండి కార్పొరేషన్ మేయర్ వరకు..
కొత్తగూడెం కార్పొరేషన్ తొలి మేయర్‌గా ఎన్నికైన మూడ్ గణేష్ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక సామాన్య ఐటిఐ (ఎలెక్ట్రిసియాన్) చదువుకున్న వ్యక్తి నుండి కార్పొరేషన్ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగారు.
మేయర్ ప్రొఫైల్:
* పేరు: మూడ్ గణేష్ (20వ డివిజన్ - సుజాతనగర్ టౌన్)
* కుటుంబం: తండ్రి రాములు, భార్య సింధు, కుమారుడు సాత్విక్.
* రాజకీయ నేపథ్యం: 2019లో ఎంపిటిసిగా ఎన్నికై ప్రజల మెప్పు పొందారు. ప్రస్తుతం సిపిఐ సుజాతనగర్ మండల కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు.
* స్వగ్రామం: కోమటిపల్లి (ఇది కార్పొరేషన్‌లో విలీనం కావడంతో అక్కడి నుండి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు).
ప్రజల ఆశలు.. మేయర్ బాధ్యతలు
సింగరేణి కార్మిక క్షేత్రమైన కొత్తగూడెంను మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని నూతన మేయర్ మూడ్ గణేష్ ప్రకటించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలతో సామాన్యుడికి పాలనను చేరువ చేస్తామని, కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు రాబడతామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.












