సర్వే ఆధారంగానే మున్సిపల్ టికెట్లు – మ్యాచ్ ఫిక్సింగ్‌కు శాశ్వత సస్పెన్షన్ : మైనంపల్లి హనుమంత రావు
*ప్రజాగొంతుక (మెదక్ ప్రతి నిది జనవరి 21)*
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు పూర్తిగా సర్వే ఆధారంగానే నిర్ణయిస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి సర్వే పూర్తయ్యిందని, మరికొన్ని సర్వేలు కొనసాగుతున్నాయని తెలిపారు.
బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ తో కలిసి మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడితే పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. గెలిచే అవకాశం ఉన్న కొత్త నేతలకు కూడా టికెట్లు ఇస్తామని తెలిపారు.
టికెట్లు రాని సీనియర్ నాయకులు ఆందోళన చెందవద్దని, వారికి నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంచి మెజార్టీతో గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి మరిన్ని నామినేటెడ్ పదవులు తీసుకొస్తామని అన్నారు.
అభ్యర్థులను గెలిపించే బాధ్యత కాంగ్రెస్ క్యాడర్‌పై ఉందన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు పెట్టవద్దని సూచించారు. కాంగ్రెస్ బలానికి భయపడి హరీష్ రావు మెదక్ వైపు చూడలేని పరిస్థితి తెచ్చేలా శ్రేణులు పనిచేయాలని కోరారు.
రెండేళ్లలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చామని తెలిపారు. సీఎం ప్రత్యేక చొరవతో మెదక్ మున్సిపాలిటీకి రూ.85 కోట్లు, ఏడుపాయల అభివృద్ధికి రూ.35 కోట్లు, మెదక్ చర్చికి రూ.30 కోట్లు మంజూరయ్యాయని, పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












