స్టోన్ క్రషర్ అనుమతులు రద్దు చేయాలి
కొత్త క్రషర్ టెండర్లకు పర్మిషన్లు ఇవ్వొద్దు..
ఉప సర్పంచ్ తుడుం రాజు ఆధ్వర్యంలో
కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన పత్తిపాక గ్రామ ప్రజాప్రతినిధులు
ప్రజా గొంతుక ప్రతినిధి శాయంపేట/హనుమకొండ(మార్చి 16) :
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో ఉన్న స్టోన్ క్రషర్ వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాని అనుమతులను తక్షణమే రద్దు చేయాలని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పత్తిపాక గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల బృందం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. క్రషర్ నుండి వెలువడుతున్న విపరీతమైన దుమ్ము, శబ్ద కాలుష్యం కారణంగా గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి క్రషర్ నిర్వహిస్తున్నారని, దీనివల్ల పంట పొలాలు కూడా దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులకు మించి తవ్వకాలు జరిపారని, బోర్ బ్లాస్టింగ్స్ వల్ల ఇండ్లు పగుల్లుపడుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న క్రషర్‌తోనే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటే, కొత్తగా మరో క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త క్రషర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు మంజూరు చేయకూడదని కోరారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ తమకు ముఖ్యమని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్లపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం" అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక ఉప సర్పంచ్ తుడుం రాజు, వార్డు మెంబర్లు నాలికె వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరపు సాయి లక్ష్మి, కొడిమాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారతి కర్ణాకర్, చిట్టి రెడ్డి పద్మ జంగారెడ్డి, ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు, నాయకులు పెండేల కిరణ్, పోతుగంటి సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.












