దళిత మహాసభను విజయవంతం చేయాలి మైస ఉపేందర్ మాదిగ
ప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి (ప్రసాద్): మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 18న హన్మకొండలో నిర్వహించనున్న దళిత మహాసభను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని ఎంహెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం హన్మకొండలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళిత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రధాన వేదికగా ఈ మహాసభ నిలుస్తుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదన్నారు. అధికారంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వం దళితుల అభివృద్ధి పేరుతో హామీలు ఇస్తున్నప్పటికీ అవి అమలులోకి రావడం లేదని విమర్శించారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో దళితుల అభివృద్ధి కోసం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. పథకాల ప్రకటనలు చేస్తున్నప్పటికీ అవి అర్హులైన దళిత కుటుంబాలకు చేరడం లేదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమానికి కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో వినియోగం కాకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు.రాష్ట్రంలో ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం కనీసం 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించి తక్షణమే చైర్మన్లను నియమించాలని కోరారు.
ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించే “అంబేడ్కర్ అభయహస్తం” పథకాన్ని ప్రకటించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా దళిత కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా అనేక ప్రాంతాల్లో దళితులు సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దళితుల గౌరవం, హక్కుల సాధన కోసం సమాజం మొత్తం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.మార్చి 18న హన్మకొండలో నిర్వహించనున్న దళిత మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభ దళితుల ఐక్యతకు, హక్కుల సాధనకు కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేల్పుల రామ్‌కుమార్, మాతంగి సంతోష్, ప్రధాన కార్యదర్శి మంద రాకేష్, నాయకులు వేల్పుల నవీన్, వేల్పుల కిరణ్, ధృవకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు...












