అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్ మార్చ్ 16 ( ప్రజా గొంతుక )జీహెచ్ఎంసీ పునర్విభజన అనంతరం ఏర్పడిన సర్కిళ్లు, వార్డుల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని వివిధ సర్కిళ్లకు చెందిన ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ పునర్విభజన తర్వాత ఏర్పడిన నూతన వార్డుల్లో ప్రజల అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, స్థానిక ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని వార్డులలో సమగ్ర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించి, ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను అందించాలన్నారు.మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, స్మశాన వాటికలు, పార్కులు, నాలాలు, వీధిదీపాలు తదితర సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వివిధ కాలనీలు, బస్తీలలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి ప్రణాళిక బద్దంగా వ్యయప్రణాళికలు రూపొందించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్.ఈ. శ్రీకాంతి, ఈఈ భద్రు, డీఈలు పాపమ్మ, అనురాగ్, విరాట్ రాజ్‌కుమార్, వసంత, బాలమురళీ, ఏఈలు సురేందర్ నాయక్, కళ్యాణ్, ప్రవీణ్ కుమార్, రవీందర్, కీర్తిరెడ్డి, సాయి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.












