మంచినీటి సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్
కుత్బుల్లాపూర్ మార్చ్ 13, (ప్రజా గొంతుక )వేసవికాలం ఆరంభంలోనే తాగునీటిని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగద్గిరి గుట్ట డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆరోపించారు. జగద్గిరిగుట్ట డివిజన్ ఆర్జికే కాలనీలో గత రెండు నెలల నుండి మంచినీటి సరఫరా చేయడం లేదని కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ కు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం కాలనీవాసులతో కలిసి జగద్గిరిగుట్ట జలమండలి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ...గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు విడిచి రోజు మూడు గంటల పాటు నిరవధికంగా మంచినీటి సరఫరా చేసి స్థానిక ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తుందని అది కూడా కేవలం ఒక గంట పాటు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలలోనే తాగునీటి కొరత ఉంటే ఏప్రిల్, మే మాసంలో పరిస్థితిని అంచనా వేస్తేనే భయంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మపురి అంజయ్య, నాయకులు భూపతి రెడ్డి, పరశురాములు, వెంకటస్వామి గౌడ్, నరసింహారెడ్డి, హనుమంతు, బ్రహ్మచారి, సంపత్ రెడ్డి, సునీల్ రెడ్డి, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












