మహిళా దినోత్సవ వేడుకల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపు
*కుత్బుల్లాపూర్ మార్చ్ 11 ( ప్రజా గొంతుక )*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సిఐటియు బాచుపల్లి కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతి నగర్ సుందరయ్య భవన్ లోని నిర్వహించిన సదస్సు లో సిఐటియు బాచుపల్లి మండల కార్యదర్శి రాథోడ్ సంతోష్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఐద్వా మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎం. వినోద మాట్లాడుతూ....అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మహిళల సుదీర్ఘ పోరాటాల ఫలితమని తెలిపారు.
1901లో కోపెన్‌హేగన్‌లో జరిగిన సోషలిస్ట్ మహిళల సదస్సులో క్లారా జెట్కిన్ ప్రతిపాదనతో మహిళా దినోత్సవం ప్రారంభమైందన్నారు.
న్యూయార్క్ గార్మెంట్ కార్మికుల పోరాటాలు, మహిళా కార్మికుల భారీ ప్రదర్శనలు మహిళా ఉద్యమాలకు నాంది పలికాయని చెప్పారు. అయితే నేడు పాలకులు, కార్పొరేట్ సంస్థలు మార్చి 8ను వ్యాపార ప్రకటనలు, వస్తువుల అమ్మకాలకే పరిమితం చేస్తూ మహిళా ఉద్యమాల స్ఫూర్తిని నీరుగారుస్తున్నారని విమర్శించారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తోందని, మహిళలకు సమాన హక్కులు, సమాన పనికి సమాన వేతనం కల్పించడంలో విఫలమైందని అన్నారు.
దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై హింసలు పెరుగుతున్నప్పటికీ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రామిక మహిళలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
ప్రజాసంఘాల కన్వీనర్ వెంకటరామయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల గ్రామీణ మహిళల జీవనోపాధిపై ప్రభావం పడుతోందన్నారు. మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, హత్యలు పెరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు.
సిఐటియు బాచుపల్లి మండల కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
మహిళలకు సమాన హక్కులు, సమాన పనికి సమాన వేతనం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఐద్వా ప్రగతి నగర్ కార్యదర్శి రోజా మాట్లాడుతూ...పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం (2013) అమలులో లోపాలున్నాయని అన్నారు. అన్ని కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేసి చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఇంద్ర సిఐటియు మండల కమిటీ సభ్యులు పెంటయ్య, పి.స్వామి, లింగమ్మ, నాగలక్ష్మి, మనీ, బుజ్జమ్మ, అలివేలు, శైలజ, శివమ్మ, నవ్య, చిట్టెమ్మ, నాగమ్మ, తిరుపతమ్మ, అలివేలు తదితరులు పాల్గొన్నారు.












