సిపిఎస్ ఉద్యోగుల పెండింగ్ డీఏ వాయిదాల బకాయిలను వెంటనే చెల్లించాలి
- టిఎస్సీ పిఎస్ఈయు జిల్లా అధ్యక్షులు నాగరాజు
తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. అమరవాయి హైస్కూల్ లో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం బాధాకరమని, ప్రభుత్వం సకాలంలో వీటిని చెల్లించకుండా వాయిదాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వల్ల ప్రస్తుతం అవి 60కి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాయిదాల ద్వారా రావలసిన మొత్తం సుమారు 1200 కోట్లకు చేరడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేస్తున్న 700 కోట్ల నిధులలో భాగంగా ప్రతి నెల తప్పనిసరిగా సీపీఎస్ బకాయిల కోసం కేటాయించాలని కోరారు. అలాగే గత ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని ( ఓ పి ఎస్ ) అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ నరేష్,కాంప్లెక్స్ సెక్రటరీ శాంతన్న, టి ఎస్ ఈ పి ఎస్ ఈ యు మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పుట్ట నాగరాజు,ఎస్టియు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, సుంకన్న,సీతం నాయుడు, శ్రీరాములు, భాస్కర్, శ్రీలత, రజిత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.












