పెయింటర్ చేతుల్లో పరిమళించిన మానవత్వం.......
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:10
పెయింటింగ్ పనులతో జీవనం నిరాశ్రయులకు ఆశగా మారిన అమీర్ అలీ సేవా ప్రయాణం
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం మధారిగూడెం గ్రామానికి చెందిన జానిమియ మహిముద దంపతుల కుటుంబం పేదరికానికి మరో పేరు. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు… ఐదుగురు పిల్లల బాధ్యత. రోజువారీ జీవనమే పోరాటంగా మారిన ఆ ఇంట్లో, భవిష్యత్తు అన్నది ఒక ప్రశ్నార్థకమే.
ముఖ్యంగా ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి? సొంత ఇంటి కల ఎప్పుడైనా నెరవేరుతుందా? అనే ఆలోచనలు తల్లిదండ్రుల మనసును నిత్యం వేధించేవి.
ఆ కష్టాలన్నిటిని కళ్లారా చూస్తూ పెరిగినవాడే అమీర్ అలీ..
హాలియాలోని ఆదర్శ విద్య మందిర్‌లో ఐదో తరగతి వరకు చదివిన అమీర్ అలీకి, ఆ తర్వాత చదువు ఒక కలగానే మిగిలిపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు పాఠశాల గడప దాటే అవకాశాన్ని ఇవ్వలేదు. చిన్న వయసులోనే చదువు మానేసి, జీవన పోరాటంలోకి దిగాల్సి వచ్చింది.
ఆకలి విలువ, కష్టపు గౌరవం ఇవన్నీ అతడికి పుస్తకాల ద్వారా కాదు, జీవితమే నేర్పించింది.
చదువు ఆగిపోయినా… జీవితం మాత్రం ఆగలేదు.
దురలవాట్లకు దూరంగా, తన సోదరుడితో కలిసి హౌస్ పెయింటింగ్ పనిని నేర్చుకున్నాడు. రోజువారీ కూలీ పనితో జీవనం సాగించినా, ఆ చేతుల్లో కేవలం బ్రష్ మాత్రమే కాదు , మానవత్వం కూడా పెరిగింది.
వివాహానంతరం మిర్యాలగూడలో స్థిరపడిన అమీర్ అలీ, తన కష్టార్జిత కూలిలోంచి కొంత భాగాన్ని సమాజానికి అంకితం చేయడం ప్రారంభించాడు.
బస్టాండ్ ఆవరణల్లో, షటర్ల ముందు, రోడ్ల పక్కన… చలిలో వణికుతూ పడుకున్న వృద్ధులు, నిరాశ్రయులు, యాచకులు , వీరే అతని సేవా ప్రపంచం.
చలికాలంలో దుప్పట్లు ఆకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం ఆ సేవలో పొందిన ఆత్మసంతృప్తే అతని నిజమైన సంపదగా మారింది.
అతని సేవా కార్యక్రమాలను గమనించిన సేవాసంస్థలు, అతన్ని తమతో కలిపాయి. ‘హెల్పింగ్ హ్యాండ్’ సంస్థ ద్వారా, అలాగే తరువాత ‘జనయేత్రీ ఫౌండేషన్’లో కార్యదర్శిగా పనిచేస్తూ, సేవ అంటే మాటల్లో కాదు… కార్యరూపంలో ఎలా ఉండాలో చూపించాడు.
అనుభవం పెరిగింది… ఆలోచనలు స్పష్టమయ్యాయి.
తన సేవా దృక్పథానికి స్వంత రూపమిచ్చేలా అమీర్ అలీ ఫౌండేషన్ ను స్థాపించాడు.
తనలాంటి మనసున్న మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు వందకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.
అతని సేవల్లో కొన్ని…
ఆనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు నెల రోజుల నిత్యావసర సరుకుల పంపిణీ
చలికాలంలో బస్టాండ్లు, రోడ్ల పక్కన ఉన్న వృద్ధులకు దుప్పట్లు, భోజనం
అత్యవసర పరిస్థితుల్లో రక్తదాన ఏర్పాట్లు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, షూల పంపిణీ
“సమాజం మనకేమిచ్చింది? అనే ప్రశ్నకంటే,
సమాజానికి మనం ఏమిచ్చాం? అనే ప్రశ్నే నా జీవితానికి దారి చూపింది”
అంటాడు అమీర్ అలీ.
డిగ్రీలు లేని ఈ పెయింటర్…
పదవులు లేని ఈ కూలీ…
మానవత్వంలో మాత్రం ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.
అమీర్ అలీ కథ ఒకటే చెబుతోంది
సేవ చేయడానికి సంపద అవసరం లేదు…
పదవులు అవసరం లేదు…
మనసుంటే చాలు.
కష్టాల మధ్య పుట్టిన మానవత్వమే
ఈ సమాజానికి నిజమైన ఆశ అని అమీర్ అలీ జీవితం సాక్ష్యంగా నిలుస్తోంది.












